జగన్‌కు హైకోర్టు మెట్లు.. కేసుల రద్దుకు పిటిషన్

10-11-2026 | 02:07pm

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు. పులివెందులలో తనపై నమోదైన క్రిమినల్ కేసును (Criminal Case) కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఈ కేసు రాజకీయ కక్షతోనే నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల మున్సిపల్ కార్యాలయం ఎదుట జగన్ నిరసన చేపట్టారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారంటూ ధర్నాకు దిగారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లో ఉండగా, అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మరో 70 మందిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని వాదిస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద నిరసన తెలిపిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లాపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తమపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ వారు కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసుల్లో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు