రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

10-11-2026 | 09:10pm

ఎంఎల్ఏ ప్రేంసాగర్ రావు

హాజీపూర్, (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదాల నివారణకు(Prevention of Road Accidents) తక్షణ చర్యలు చేపట్టాలని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు(Mancherial MLA Kokkirala Premsagar Rao) అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్(Gudipeta Indian Oil Petrol Bunk) సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో మంగళ వారం ప్రమాద స్థలాన్ని ఎంఎల్ఏ సందర్శించి పరిశీలించారు. మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్‌లను ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ జాతీయ రహదారిపై భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణమే పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారికి ఇరువైపులా పెరిగిన పొదలను తొలగించాలని, వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న పెద్ద చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

కల్వర్టులను వెడల్పు చేసి రాత్రివేళల్లో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, వైట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసి అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని ఎంఎల్ఏ కోరారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా పాత మంచిర్యాల నుంచి నగర శివారు ప్రాంతాల వరకు రహదారి విస్తరణతో పాటు డివైడర్ల నిర్మాణానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే లిక్కర్ గోదాం ఎదుట లారీలు, డీసీఎం వ్యాన్లను రోడ్డుకు ఇరువైపులా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా చూడాలని గోదాం మేనేజర్ వాణి జయలక్ష్మి గారికి సూచించారు. వాహనాలకు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా.. ప్రజల ప్రయాణ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు.

ఎంఎల్ఏ వెంట మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు