పగలు ఎండ మంట.. రాత్రి చలి పులి

10-11-2026 | 03:23pm

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం(Telangana Weather) వింతగా మారింది. పగటిపూట భానుడు నిప్పులు చెరుగుతుంటే.. రాత్రివేళ చలి తన ప్రభావాన్ని చూపిస్తోంది. సాధారణ స్థాయితో పోలిస్తే పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు(Temperature) తగ్గుతుండటంతో ప్రజలకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పగటి ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

మహబూబ్‌నగర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరింది. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పగటిపూట ఎండలు ఇబ్బంది పెడుతుంటే.. రాత్రివేళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతున్నాయి. దీంతో రాత్రి, తెల్లవారుజామున చల్లని వాతావరణం కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో పగలు వేసవి సెగలు, రాత్రి చలిగాలుల ప్రభావం కనిపిస్తుండటంతో వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని వార్తలు