కార్యదర్శి కార్యాలయానికి తాళం...

14-10-2026 | 05:01pm

- ఎప్పుడు వస్తున్నారో.... ఎప్పుడు వెళ్తున్నారో...

తాడ్వాయి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించే కార్యదర్శి బాధ్యతగా వ్యవహరించాలి. ఆయన అక్కడే గ్రామంలో ఉండి ప్రజలకు సేవలు అందించాలి. కానీ కొందరు కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

సదరు కార్యదర్శి ఉదయం గ్రామానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు గ్రామానికి వస్తున్నారో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వారు తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ లోని కార్యదర్శి కార్యాలయం గది మధ్యాహ్నమే తాళం వేసి ఉంది. ప్రతిరోజు ఇలాగే కార్యాలయం గదికి తాళం వేసి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు మధ్యాహ్నం తర్వాత ఏదైనా పని ఉంటే కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో నుండి సేవలు అందించాల్సిన కార్యదర్శి మధ్యాహ్నానికే వెళ్లిపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దేమికలాన్, కన్కల్ గ్రామాల కార్యదర్శుల కార్యాలయాలు తాళాలు వేసే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు