సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేత
కరీంనగర్ సిటీ నవంబర్ 13 (విజయ క్రాంతి): ఆశా కార్యకర్తల(ASHA workers) దీర్ఘకాలిక సమస్యలను అసెంబ్లీలో(Assembly) ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను(Former Minister and MLA Gangula Kamalakar) ఆశా సంఘం జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆయన నివాసంలో కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం, సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27,130 మంది ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గర్భిణుల సంరక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలు, అంటువ్యాధుల నివారణ, క్షయవ్యాధి నియంత్రణతో పాటు కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి సేవలందించామని పేర్కొన్నారు.
అయినప్పటికీ తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకు రూ.9,700 మాత్రమే పారితోషికంగా అందుతోందని, గత ఐదేళ్లుగా వేతనాలు పెరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు: నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రూ.50 లక్షల జీవిత బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ సమయంలో రూ.5 లక్షల ప్రయోజనం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఆదివారాలు, పండుగలకు సెలవులు, క్యాజువల్, మెడికల్ లీవ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే బీఆర్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని గంగుల కమలాకర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్,
మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, ఆశా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం.డి. రబియా బేగం, ప్రధాన కార్యదర్శి దొండపాటి సరిత, ఉపాధ్యక్షురాలు నాంపెల్లి సుమలత, కోశాధికారి మాచర్ల వనజ, కార్యదర్శి జేరిపోతుల జయలలిత, సంయుక్త కార్యదర్శులు మాచర్ల భాగ్యలక్ష్మి, తిప్పారపు జయలలిత, బీఆర్టీయూ నాయకుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.