ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

13-11-2026 | 04:22pm

ఘనంగా వర్ధంతి వేడుకలు

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు(Padma Vibhushan Kaloji Narayana Rao) వర్ధంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సమాజానికి, సాహిత్య రంగానికి కాళోజీ అందించిన విశిష్ట సేవలను పలువురు వక్తలు స్మరించుకున్నారు.

నిజాన్ని నిర్భయంగా పలికిన అక్షర యోధుడిగా, ప్రజల కష్టాలను తన కలం ద్వారా ప్రపంచానికి చాటిన సామాజిక చైతన్య ప్రదాతగా కాళోజీ చిరస్మరణీయులని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అధికారాన్ని ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, అణగారిన వర్గాల పక్షాన నిలబడటం కాళోజీ జీవితం నేర్పిన గొప్ప సందేశాలని వక్తలు అన్నారు. ఆయన రచనలు కేవలం సాహిత్య సృజనకే పరిమితం కాకుండా సమాజంలో చైతన్య జ్వాలలు రగిలించాయని గుర్తుచేశారు. కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నామిరెడ్డి వెంకట్రెడ్డి, వాకర్ ఇంటర్నేషనల్ 33 వరంగల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్ గవర్నర్ కస్తూరి రాజు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ, చాడా దశరథ రామిరెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, విష్ణువర్ధన్ మైస నాగయ్య, శ్రీనివాస్, పెద్ది వెంకన్న, జిలకర శ్రీహరి, మల్లారెడ్డి, దామోదర్, దేవేందర్ రెడ్డి, విద్యాసాగర్, నరేష్ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు