ఎల్నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

15-10-2026 | 09:59pm

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, అక్టోబరు 15 (విజయ క్రాంతి): ఎల్నినో నేపథ్యంలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) ఆదేశించారు. గురువారం ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా, సమస్యలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ, భూగర్భజల శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై వచ్చే గురువారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. అప్పటిలోగా ప్రతి శాఖ అధికారి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు. సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు