ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో యువకుని హత్య
కరీంనగర్ క్రైం, నవంబర్ 6 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) బస్టాండ్ లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించి ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్య చేసి ఉంటారని భావించి ఘటన స్థలంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని రాత్రికి రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ కార్ఖానా గడ్డకు చెందిన మీర్జా ఇబ్రహీం బేగ్(23), సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన మద్ది సుధాకర్(22) చెడు అలవాట్లకు బానిసలై సన్నిహితంగా ఉంటూ గతంలో పలు నేరాలకు పాల్పడ్డారు. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో మద్ది సుధాకర్ ను అంతమొందించాలని మీర్జా ఇబ్రహీం బేగ్ వ్యూహం రచించాడు. బస్టాండ్ మధ్య గేటు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఉన్న సుధాకర్ ని గమనించిన ఇబ్రహీం బేగ్ కొద్దిసేపు వాగ్వివాదం పెట్టుకొని అక్కడే ఉన్న సిమెంట్ రాయితో తలపై మోదీ హత్య చేశాడు.
ఆటో డ్రైవర్లు గమనించి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ వెంకటరామిరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగి ఉంటుందని భావించి ఆధారాలు సేకరించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కంట్రోలర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మీర్జా ఇబ్రహీం బేగ్ కోసం గాలింపులు చేపట్టారు.