బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మేయర్
ముకరంపుర, అక్టోబర్ 15(విజయ క్రాంతి) బొమ్మకల్ సద్దుల బతుకమ్మకు(Bommakal Saddula Bathukamma) ఏర్పాట్లు చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను పురస్కరించుకుని గురువారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బొమ్మకల్ లో పర్యటించారు.
ఈ ప్రాంత ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో బొమ్మకల్ ప్రాంతంలోని బతుకమ్మ ఆడే పాయింట్లతో పాటు చెరువు కట్ట ప్రాంతంలో గల నిమజ్జనం పాయింట్లను సందర్శించారు.
ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో చేసిన ఏర్పాట్లను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. బతుకమ్మ ఆడే పాయింట్లతో పాటు చెరువు కట్ట నిమజ్జనం ఘాట్ వద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్, భారికేడింగ్, చదును, త్రాగు నీటి వసతి తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు.
బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల వెంకటేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.