కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ నేత!
అమరావతి: కూటమిలో టికెట్ల కేటాయింపు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మున్సిపల్ చైర్మన్ టికెట్(Municipal Chairman Ticket) జనసేన పార్టీకి కేటాయించడంతో టీడీపీ నేత సూరిబాబు రాజు(TDP Leader Suribabu Raju) తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈసారి కూడా చైర్మన్ టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన ఆయనకు కూటమి నిర్ణయం షాక్ ఇచ్చింది.
పెద్దాపురంలో గత కొన్నేళ్లుగా చైర్మన్గా గెలుస్తూ వస్తున్న సూరిబాబు రాజు, ఈసారి కూడా అదే పదవికి అవకాశం లభిస్తుందని భావించారు. అయితే, కూటమి పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటులో భాగంగా చైర్మన్ టికెట్ జనసేన(Janasena)కు కేటాయించినట్లు సమాచారం. దీంతో తనకు అవకాశం దక్కకపోవడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
టికెట్ కేటాయింపుపై సూరిబాబు రాజు అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా పార్టీ కోసం శ్రమించిన వారికి అవకాశం కల్పించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ, జనసేన(Janasena TDP) మధ్య కూటమి ఒప్పందంలో భాగంగా జరిగిన టికెట్ల పంపకం పెద్దాపురంలో రాజకీయ చర్చకు దారితీసింది. ఒకవైపు పొత్తు ధర్మం, మరోవైపు స్థానిక నాయకుల ఆశలు.. ఈ రెండింటి మధ్య టికెట్ కేటాయింపు వివాదం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది? స్థానికంగా అసంతృప్తిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది వేచి చూడాలి.