స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు కల్పించాలి
అదనపు కలెక్టర్ డా. అశ్విని వాకడే తనాజీ, ఐ ఎఎస్
కొత్తపల్లి, నవంబర్ 18(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో(Collectorate) బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వ విదేశీ వాణిజ్య శాఖ , హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, వ్యాపారులు, సంబంధిత శాఖల ప్రతినిధులతో నిర్వహించిన మెగా ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమం జరిగింది.
ఈ-కామర్స్ సమ్మిట్‌కు అదనపు కలెక్టర్ డా. అశ్విని వాకడే తనాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మామిడి, బియ్యం, పసుపు వంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కళాకృతులు, చేనేత ఉత్పత్తులు, గ్రానైట్, వస్త్రాలు మరియు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ-కామర్స్ వేదికల ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, రైతులు, కళాకారులు సైతం తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయవచ్చని పేర్కొన్నారు. ఉత్పత్తుల నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా, డిజిఎఫ్టి ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలు,
వనరులు, సదుపాయాలను వినియోగించుకొని మధ్యవర్తులపై ఆధారపడకుండా వీలైనంతవరకు నేరుగా విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ముందుకు రావాలని రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిజిఎఫ్టి అదనపు డైరెక్టర్ జనరల్ డా. ఆర్. సంపత్ కుమార్ ఎగుమతులకు సంబంధించిన వివిధ అంశాలపై కీలకోపన్యాసం చేశారు.
విదేశీ వాణిజ్య విధానం–2023 (ఎఫ్ టీపి), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ( ఎఫ్టీఎఎస్ ), ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈ-కామర్స్ ఎగుమతులు, ఐఈసి రిజిస్ట్రేషన్, ఎగుమతుల నిబంధనలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. కొత్త ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం డిజిఎఫ్టి జాయింట్ డైరెక్టర్ ఎస్.ఏ. చవాన్ ఎగుమతులకు అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఐఇసి, డిజిఎఫ్టి ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, ఈ-కామర్స్ ద్వారా ఎగుమతులు చేపట్టే విధానాలపై వివరించారు.
ఎంఎస్ఎంఈ, ఫీఫో, ఎపిఇడిఎ, ఇండియా పోస్ట్, ఈసిజిసి, వాల్‌మార్ట్ సంస్థల ప్రతినిధులు, ఎగుమతుల ప్రోత్సాహం, అంతర్జాతీయ మార్కెట్ల విస్తరణ, సామర్థ్య నిర్మాణం, ఎగుమతుల బీమా, రవాణా సౌకర్యాలు, ఈ-కామర్స్ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మామిడి రైతులు, వ్యాపారులు, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు, వస్త్ర పరిశ్రమల పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.ఎస్. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హన్మంతు, పెద్దపల్లి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కీర్తికాంత్, జగిత్యాల జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి మధులత తదితరులు పాల్గొన్నారు.