పెద్ద చింతరేవుల ఆలయ వేలం ఖరారు!
రూ.8.26 లక్షల ఆదాయం
ధరూర్ నవంబర్18: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో(Pedda Chintarevula Village) వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన టెంకాయలు, కొబ్బరి చిప్పలు, మిఠాయిల దుకాణం నిర్వహణ హక్కుల కోసం నిర్వహించిన బహిరంగ వేలంపాట ఖరారైంది.
ఈ వేలంపాటలో ఆత్మకూర్ గ్రామానికి చెందిన యశ్వంత్ రూ.4,66,500లకు టెంకాయల వేలం హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.56,500 అదనపు ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ సి. గిరిరావు, ఈవో ఎం. రాజేశ్వర శర్మ తెలిపారు.
అదేవిధంగా కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో జమ్మిచేడు గ్రామానికి చెందిన గోపాల్ రూ.2,60,000లకు దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.1,36,000 అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మిఠాయిల దుకాణం నిర్వహణ హక్కులను గద్వాల పట్టణానికి చెందిన రాజేష్ రూ.1,00,000లకు దక్కించుకున్నారు.
ఈ మూడు వేలం హక్కుల ద్వారా ఆలయానికి మొత్తం రూ.8,26,500 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ గాళ్ల రఘు, ఆలయ సిబ్బంది, పూజారులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.