కేంద్ర మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సభ్యులు
కరీంనగర్ సిటీ నవంబర్10 (విజయక్రాంతి ): నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(National Union of Journalists) (ఇండియా) జాతీయ కౌన్సిల్ సభ్యులుగా వేల్పుల శ్రీనివాస్, సూదుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను(Bandi Sanjay Kumar) మర్యాదపూర్వకంగా కలిసి తమ నియామక విషయాన్ని తెలియజేశారు. వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టు సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. తమకు ఈ బాధ్యత అప్పగించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ), ఎన్‌యూజేఐ సంస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సామాజిక, ఆర్థిక సమస్యలను జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, అక్రిడిటేషన్లు, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై సంఘటితంగా పోరాడుతామని తెలిపారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా జర్నలిస్టు సమాజానికి సేవ చేసే అవకాశంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పడకంటి శ్రీనివాస్, గాండ్ల చంద్రశేఖర్, సుద్దాల భాస్కర్, చిరంజీవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.