సాదాబైనామా దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలి

12-09-2026 | 12:56pm

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 12(విజయక్రాంతి): భూభారతి, సాదా బైనామా దరఖాస్తులను వెంటవెంటనే  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై  కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, నో మ్యాపింగ్‌, సాదా బైనామా దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ప్రభుత్వ భూముల వివరాల నిర్వహణ తదితర అంశాలపై మండలాల వారీగా పురోగతిని తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకూడదని, వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి అర్హత ఉన్న వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపడుతున్న ‘నో మ్యాపింగ్‌’ ప్రక్రియపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

‘నో మ్యాపింగ్‌’ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందించిన వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను పక్కాగా రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి అవకాశం లేకుండా రికార్డులను పరిశీలించాలని సూచించారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా దరఖాస్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. మండలాల పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే అందించే విధంగా రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు