ప్రభుత్వ మందులు.. రోడ్డుపాలు!

12-09-2026 | 01:07pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 12 (విజయ క్రాంతి):  భిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Bhikkanoor Primary Health Centre) పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మందులు పారవేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం రామేశ్వరపల్లి గ్రామ శివారులోని ఎన్‌హెచ్‌-44 రహదారి పక్కన టీఎస్‌12యూడీ2106 నంబర్‌ గల మినీ డీసీఎం వాహనంలో ప్రభుత్వ మందులను తీసుకొచ్చి రోడ్డు పక్కన పడవేస్తున్న కొందరు వ్యక్తులను ఫార్మసిస్ట్‌ స్వామి, హెల్త్‌ అసిస్టెంట్‌ సతీష్‌, అటెండర్లు శ్రావణ్‌, అబేద్‌అలీ, భాస్కర్‌ గుర్తించారు.

అనంతరం వారితో పాటు వాహనం, మందులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. వారిని భిక్కనూర్ ఆరోగ్య కేంద్ర సిబ్బంది,స్థానికులు ప్రశ్నించగా తాము కొరియర్‌కు సంబంధించిన వ్యక్తులమని, వాహనం కూడా కొరియర్‌కు చెందినదని తడబడుతూ తెలిపినట్లు  సమాచారం. బిల్లుపై మందుల విలువ సుమారు రూ.12 లక్షలుగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ యేమిమా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి. వెంకట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు