రామప్ప అద్భుతమైన ఆలయం

12-09-2026 | 01:48pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని శనివారం నాగపూర్ రైల్వే ఏఎస్పీ మంగేష్ షిండే(Mangesh Shinde) కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ స్వామివారి శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్ కుమార్ రామప్ప దేవాలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ ప్రత్యేకత, ఆలయ నిర్మాణ విశిష్టతలను ఏఎస్పీకి వివరించారు. 

ఈ సందర్భంగా మంగేష్ షిండే మాట్లాడుతూ.. రామప్ప దేవాలయ శిల్పకళ అద్భుతంగా ఉందని, ఆలయ నిర్మాణంలో కనిపించే శిల్ప నైపుణ్యం విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించిన కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేశారు. వారి వెంట స్థానిక ఎస్ఐ చల్ల రాజు, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్‌, దేవాదాయ, పురావస్తు, పర్యాటక శాఖల సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు