బస్సులో పొగలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన.. అప్రమత్తమైన అధికారులు.. తప్పిన పెను ప్రమాదం
హుజురాబాద్, నవంబర్ 06: (విజయక్రాంతి): హుజురాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక్కసారిగా చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. జమ్మికుంటకు వెళ్లేందుకు ప్రయాణికులతో బయలుదేరుతున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు వ్యాపించడంతో బస్టాండ్‌లో కొద్దిసేపు కలకలం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 15 జెడ్ 0149 నంబర్ గల బస్సు ప్రయాణికులతో జమ్మికుంటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో బస్సులో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడటంతో అప్రమత్తమైన ప్రయాణికులు భయంతో వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి నీటిని చల్లి పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రయాణికులతో బయలుదేరే సమయంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆర్టీసీ బస్సుల నిర్వహణ, విద్యుత్ వ్యవస్థ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బస్సులను ప్రయాణాలకు పంపించే ముందు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.