యాసంగిలో వరి సాగు చేయవద్దు
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలి ....
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం జిల్లాలో 17 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం
యాసంగిలో సాగునీటి విడుదల ఉండదు.. త్రాగునీరు, పశువుల అవసరాలకే ప్రాధాన్యం
మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, అక్టోబర్- 16(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో(Khammam District) నెలకొన్న ఎల్నినో పరిస్థితుల(El Nino conditions) నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్లో వరి సాగు(Paddy cultivation) చేయకుండా, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, తదితర ఆరుతడి పంటల(Wet crops) సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్(District Collector Diwakar T.S.) సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీరు, పశువుల అవసరాలకు వినియోగించాల్సి ఉన్నందున యాసంగిలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల నుంచి సాగునీటి విడుదల ఉండదని స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఎల్నినో ప్రభావం, ఎస్ఐఆర్ 2026, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తుగానే రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించామని తెలిపారు.
జిల్లాలో 17 మండలాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 17 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండవచ్చని గుర్తించామని, వీటిలో 10 మండలాల్లో తీవ్ర కరువు, ఏడు మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులు ఉన్నట్లు వివరించారు.
ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల కొంత మేర భూగర్భ జలాలు పెరిగినప్పటికీ, రాబోయే 15 రోజుల్లో జల మట్టాలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే వర్షాకాలం వరకు తగిన వర్షాలు కురిసే అవకాశాలు పరిమితంగా ఉన్నందున రైతులు యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నందున సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లో సాధ్యమైనంత మేరకు చెరువులను నింపినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ప్రజల త్రాగునీటి అవసరాలకు, పశువుల నీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు.
వైరాలో అందుబాటులో ఉన్న నీరు సుమారు 149 రోజులు, పాలేరులో నీరు సుమారు 99 రోజుల పాటు త్రాగునీరు అందించవచ్చని తెలిపారు. వచ్చే ఆగస్టు వరకు త్రాగునీటి సరఫరా కొనసాగించేందుకు పాలేరు రిజర్వాయర్ను మరో రెండు నుంచి మూడు విడతల్లో నింపాల్సి ఉంటుందని చెప్పారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.