నాగండ్ల శ్రీనివాసరావు దంపతుల మృతి తీవ్రంగా కలచివేసింది
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
* కొండాపురంలో మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
ఖమ్మం రూరల్ విజయక్రాంతి: కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగండ్ల శ్రీనివాసరావు - రమాదేవి దంపతులు ఇటీవల రెండు రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు హఠాన్మరణ చెందడం తనని ఎంతో కలచివేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని కొండాపురం గ్రామంలో నాగండ్ల శ్రీనివాసరావు - రమాదేవి చిత్రపటాల వద్ద ఘన నివాళులు అర్పించారు.
వారి ఇద్దరు కూతుళ్లు సౌజన్య - శరత్, స్రవంతి - అశోక్ చంద్ర, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస రావు గారితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. వారి కుటుంబానికి.. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.