కార్తీకం.. శివమయం..! కేతకికి పోటెత్తిన భక్తజనం
ఝరాసంగం, నవంబర్ 24: జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి(Karthika Purnima) వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అష్టతీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం పౌర్ణమి పర్వదినం కావడంతో పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెల్లవారుజామున స్వామివారికి నాదస్వర సేవ, సుప్రభాత సేవ, మేల్కొలుపు సేవ, మహారుద్రాభిషేకం, అమ్మవారికి అలంకరణ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం, మహా మంగళహారతి నిర్వహించారు. ఉదయం 4:45 గంటల నుంచి భక్తులకు ధర్మదర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు స్పర్శదర్శనాన్ని నిలిపివేశారు. ధర్మ దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది.హైదరాబాద్, బీదర్, నారాయణఖేడ్, రాయికోడ్, అల్లాదుర్గం, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్, చించోలి వివిధ ప్రాంతాలు నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు.
ముందుగా స్వామివారి అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ పరిసరాలు 'ఓం నమఃశివాయ' పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాష్ట్ర చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా జెడ్పీ సీఈవో ఎల్లయ్య స్వామివారి స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుద్రప్ప, స్థానిక ఎస్సె క్రాంతి కుమార్ ఏర్పాటను ఎప్పటికప్పుడు పర్యవేకిస్తున్నారు.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే..
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారిని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం, దీపారాధన, గంగా హారతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జగదీష్, గ్రామ సర్పంచ్ వినోద బాల్ రాజ్, సర్పంచ్లు కృష్ణ, సోహెల్, జైపాల్ రెడ్డి, నాయకులు ఏజెస్ బాబా, నాగేష్ సజ్జన్, శ్రీను పటేల్, కేతన్, ప్రవీణ్, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.