భక్తి పారవశ్యంలో ఓలలాడిన ఓరుగల్లు
దేవాలయాల్లో.. కార్తీక శోభ!
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
దీపకాంతులతో దేదీప్యమానంగా పుణ్యక్షేత్రాలు
భక్తిపారవశ్యంలో ఉమ్మడి వరంగల్
మహబూబాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక మాసం.. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలం.. పరమశివుని ఆరాధనకు పరమ పవిత్ర సమయం.. హరహర మహాదేవ.. శంభో శంకర.. అంటూ మార్మోగుతున్న శివనామస్మరణలతో ఓరుగల్లు పుణ్యభూమి భక్తి పారవశ్యంలో ఓలలాడింది. ఎటుచూసినా కార్తీక దీపాల వెలుగులు.. ఎక్కడ చూసినా భక్తజన సందోహాలు.. ఆలయ ప్రాంగణాల్లో వేదమంత్రోచ్ఛారణలు.. అభిషేకాలు, అర్చనలు, రుద్రపారాయణాలతో ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కాకతీయుల కళావైభవానికి సాక్ష్యంగా నిలిచిన హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం, శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం, వరంగల్‌లోని స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం, పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కందగిరి క్షేత్రం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘనపురం కోటగుళ్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రాలు కార్తీక మాస ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆయా ఆలయాలకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో దీపారాధనకు విశిష్టమైన స్థానం ఉంది.
తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రమిదలను వెలిగించారు. ఆలయ ప్రాంగణాల్లో వరుసగా వెలిగే దీపాలు ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్మాయి. ఓరుగల్లు ప్రాంతం కాకతీయుల పాలనా వైభవానికే కాకుండా అపురూపమైన దేవాలయ సంపదకు కూడా ప్రసిద్ధి. రాతిలో చెక్కిన శిల్పకళా సౌందర్యం, శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఆలయ నిర్మాణాలు, భక్తుల హృదయాలను పరవశింపజేసే దైవ సన్నిధులు కార్తీక మాసంలో మరింత శోభాయమానంగా కనిపించాయి. గోదావరి నది లో కార్తిక పౌర్ణమి సందర్భంగా వందలాదిమంది దీపదానం చేశారు. రాత్రి అనేక దేవాలయాల్లో అఖండ దీపం వెలిగించారు.