నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్

14-10-2026 | 05:44pm
  1. మైనర్ మిస్సింగ్ కేసులను అత్యంత ప్రాధాన్యతతో విచారించాలి*
  2. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి
  3. జిల్లా వ్యాప్తంగా విజబుల్ పోలిసింగ్.. నిరంతరం వాహనాల తనిఖీలతో నేరాలు కట్టడి

ఖమ్మం, అక్టోబర్ 14(విజయక్రాంతి): మైనర్ బాలబాలికలు(Minor boys and girls) కనిపించకుండా పోయిన కేసులను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, ప్రతి కేసులో తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) అధికారులను ఆదేశించారు.

మంగళవారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో(police conference hall) నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..మైనర్ మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కేసు తీవ్రతను గుర్తించి, ఆలస్యం చేయకుండా చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని సూచించారు.

మిస్సింగ్ అయిన బాలబాలికల ఆచూకీ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ సమాచారం, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. బాలబాలికలు ప్రమాదంలో ఉన్నారనే అనుమానం ఉన్నప్పుడు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని, మానవ అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి కోణాల్లోనూ కేసు పరిస్థితులకు అనుగుణంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మైనర్ల ఆచూకీని త్వరితగతిన గుర్తించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి మైనర్ మిస్సింగ్ కేసు పురోగతిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, నర్సింహారావు,సాంబరాజు,సుశీల్ సింగ్, ఏవో కళావతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు