చెరువులో నీటిని నిల్వ ఉంచాలి

14-10-2026 | 07:00pm

-తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

వెంకటాపూర్ (విజయక్రాంతి): రాబోయే ఎండాకాలంలో గ్రామ పశుసంపదకు నీటి కొరత ఏర్పడకుండా ఇంచెంచెర్వుపల్లి గ్రామ చెరువులో తగినంత నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం మండల తహసీల్దార్(Tahsildar)కు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. ఇంచెంచెర్వుపల్లి గ్రామ చెరువులో నీటిమట్టం ప్రస్తుతం మూలబండల స్థాయికి చేరుకుంటోందని, చెరువులోని నీటిని రైతులు పంట పొలాలకు వినియోగిస్తున్నారని వారు పేర్కొన్నారు.

రైతుల వ్యవసాయ అవసరాలను గౌరవిస్తూనే, రాబోయే వేసవిలో పశువులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువులో అవసరమైన నీటిని నిల్వ ఉంచడం అత్యంత ముఖ్యమని తెలిపారు. వేసవిలో విద్యుత్ సమస్యలు, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఎదురైతే పశువులకు నీరు అందించడం కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల ఇతర నీటి అవసరాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కావున సంబంధిత అధికారులు చెరువు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పశుసంపదకు, ఇతర అత్యవసర అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇంచెంచెర్వుపల్లి విలేజ్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ అశోక్, వార్డు సభ్యుడు మురళి, టీఆర్‌పీ సోషల్ మీడియా కన్వీనర్ విజయ కుమార్, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు