ఎయిడ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

15-10-2026 | 01:31pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ కె. హరిత పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్‌ఐవీ అవగాహన ర్యాలీని (Awareness Rally) అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మట్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 736 మంది హెచ్‌ఐవీ (HIV) బారిన పడగా, వారందరికీ రిఫరల్‌ ఆసుపత్రి ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించుకోవాలని, వ్యాధి నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలని తెలిపారు. సకాలంలో వైద్య సేవలు పొందకపోతే జీవిత భాగస్వామికి కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు, తగిన జాగ్రత్తలు పాటించడం అవసరమని స్పష్టం చేశారు.

క్యూఆర్‌ కోడ్‌ (QR Code) ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం, సహాయం కోసం ఎయిడ్స్‌ హెల్ప్‌లైన్‌ (Helpline) 1097ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగేంద్ర, రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు