ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

26-11-2026 | 06:48pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాహన ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు (Traffic Rules) తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ (Road Safety Committee) సమావేశానికి ఎస్పీ నితికా పంత్, సబ్ కలెక్టర్ హర్షచౌదరి, రాజస్వ మండల అధికారి లోకేశ్వర్‌రావుతో కలిసి ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు రక్షణ సూత్రాలు పాటించాలని తెలిపారు. రహదారులపై వాహనాల పార్కింగ్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు (Warning Boards) ఏర్పాటు చేయాలని, రహదారి మలుపుల వద్ద చెట్లు, పొదలను తొలగించాలని సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్‌లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

రహదారులపై పశువులు సంచరించకుండా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పశువుల కారణంగా ప్రమాదాలు జరిగితే యజమానులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులు, ఆటో చోదకులు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాల (CCTV Cameras) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డీఎస్పీలు అశోక్, వహిదుద్దీన్, రహదారులు భవనాలు, రవాణా, మున్సిపాలిటీ, ఇంజనీరింగ్, విద్యాశాఖ, ఆర్టీసీ, జాతీయ రహదారుల శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు