జీవో ప్రకారం పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

26-11-2026 | 06:34pm

తహసీల్దార్‌కు ఏఐటీయూసీ నాయకుల వినతిపత్రం

నల్లబెల్లి, నవంబర్ 26( విజయ క్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం(State Government) జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 6/2026 ప్రకారం గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు (పారిశుద్ధ్య సిబ్బందికి) నెలకు రూ.14 వేల వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్ ముప్పు కృష్ణకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షుడు సుదర్శన్, కార్యదర్శి శనిగరం చిరంజీవి మాట్లాడుతూ. ప్రస్తుతం పంచాయతీ సిబ్బందికి కేవలం రూ.9,500 మాత్రమే వేతనం ఇస్తున్నారని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఈ మొత్తం ఏ మూలకూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ, అందులో పేర్కొన్న విధంగా రూ.14 వేలు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కనకం రాజు, లోనె లింగయ్య, గాజుల చిన్ని, దుంపెల్లి సమ్మయ్య, రామగోని దిలీప్, గజ్జి స్వప్న, జన్ను సూరమ్మ, సుజాత, రాంబాబు, సాంబయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు