ఒక్క ఫోన్ కాల్.. గర్భిణికి రక్తదానం చేసిన యువకుడు!

30-10-2026 | 02:08pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అత్యవసర సమయంలో స్పందించి ఓ గర్భిణికి రక్తదానం చేసి బంటీ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే సేవాభావంతో ముందుకొచ్చి ప్రాణదాతగా నిలిచారు.

కేరమెరి మండలానికి చెందిన ఓ గర్భిణికి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బి పాజిటివ్ (B Positive) రక్తం అత్యవసరంగా అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రానికి చెందిన బంటీ ఒక్క ఫోన్ కాల్‌కే స్పందించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధికి చేరుకుని రక్తదానం (Blood Donation) చేశారు.

సరైన సమయంలో స్పందించి గర్భిణికి అవసరమైన రక్తాన్ని అందించిన బంటీని పలువురు అభినందించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో యువత ముందుండాలని, ప్రతి ఒక్కరూ రక్తదానం (Life Saving Donation) చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.

మరిన్ని వార్తలు