అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు
ఎమ్మెల్యే తో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ఉట్నూర్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నార్నూర్ మండలం జామ్డ గ్రామంలో మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి (Asifabad MLA Kova Lakshmi) , జిల్లా కలెక్టర్ రాజర్షి షా (District Collector Rajarshi Shah) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మరో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం దోహదపడుతుందని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం అందుబాటు లోకి రావడంతో ప్రజలకు స్థానిక పాలన, ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. హౌసింగ్ పీడీ శంకర్, హౌసింగ్ డీఈ షకీర్, ఏఈ రాకేష్, తహశీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సర్పంచ్ చందర్ శావ్ పాల్గొన్నారు.