కానరాని వర్షాలు.. ఎండుతున్న పంటలు?

16-09-2026 | 05:15am
  1. పెట్టుబడులు కూడా రాని దుస్థితిలో అన్నదాతలు
  2. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి

జహీరాబాద్, సెప్టెంబర్ 15 : జహీరాబాద్ నియోజకవర్గం(Zaheerabad Constituency)లో వర్షాలు కురియకపోవడంతో పంటలు(Crops) ఎండిపోతున్నాయి. వర్షాకాలం(Monsoon season) పంటలు వర్షం పై ఆధారపడి ఉండడంతో ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతు(Farmer) గుండెలు బరువెక్కి లబోదిబోమంటున్నారు. పెసర, మినుము, సోయాబీన్,కంది, మొక్కజొన్న, పత్తి(Green gram, black gram, soybean, red gram, maize, cotton) తదితర పంటలు ఎండిపోయాయి. రైతు ఈ పంటలు పండించేందుకుగాను పత్తి పంట వేసేందుకు ప్రతి రైతుఎండాకాలం నుండి కష్టపడి దుక్కిదున్ని పంటలు వేసినప్పటికీ వానలు పడకపోవడంతో లక్షలాది రూపాయల నష్టం చవి చూడాల్సి వస్తుంది.

పత్తి పంట వేసేందుకు ప్రతి రైతు ఎకరాకు  దాదాపు 50 వేల నుండి 60 వేల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ పత్తి పంట వర్షం లేకపోవడంతో ఎండిపోతున్నాయి ఎలాంటి దిగుబడి వచ్చే సూచనలు కనిపించడం లేదు . దీంతో రైతుల ఆశలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పంట చెరుకు అయినప్పటికీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పత్తి, మొక్కజొన్న, పెసర, సోయాబీన్ లాంటి పంటలు వేసి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

చెరుకు పంట కూడా వర్షాలు సరిగ్గా ఉన్నట్లయితే ఏపుగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో చెరుకు పంట కూడా ఏపుగా పెరగకపోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఏ నోట విన్నా..ఏ మనిషిని కదిలించినా పంటల దిగుబడి మాటే వినిపిస్తుంది. మొక్కజొన్న పంట వేసిన రైతులకు మాత్రం ఎలాంటి లాభం లేకపోయింది. 

పంట ఏపుగా పెరిగి కంకి వచ్చే సమయంలోనే వర్షాలు పడకపోవడంతో ఆ పంటలన్నీ కూడా ఎండిపోయాయి. వేలాది ఎకరాల్లో వేసిన సోయాబీన్ పంట పువ్వు దశకు వచ్చి కాయ దశగా మారే సమయంలో వర్షం అవసరం ఉన్నప్పటికీ ఈ సమయంలో ఎలాంటి వర్షం పడకపోవడంతో సోయాబీన్ కూడా ఎండిపోయింది. గత సంవత్సరం అధిక వర్షపాతంతో రైతులు నష్టాలు చవి చూడగా ఈ సంవత్సరం అనావృష్టి వల్ల రైతులు నష్టాల బాధపడుతున్నారు. 

ప్రభుత్వమే ఆదుకోవాలి...

రైతులను ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు ప్రభుత్వం రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు బ్యాంకులలో రుణాలు తీసుకువచ్చి పంటలు వేసినప్పటికీ సకాలంలో వర్షాలు పడకపోవడంతో బ్యాంకుల్లో తెచ్చిన అప్పును ఎలా తీర్చాలని ఆలోచనలో పడ్డారు.

దీనికి తోడుగా బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోకపోవడంతో పత్తి రైతులు విత్తనాలను, రసాయనక ఎరువులను ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ అప్పు ఎలా తీర్చాలి అంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందించి పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి రుణమాఫీతో పాటు ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నదాతలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు