రైస్‌మిల్లుల మూగనోము.. కొనసాగుతున్న బంద్

16-09-2026 | 05:30am

మహబూబాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర కమిటీ (State Committee) పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైస్ మిల్లుల బందు కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400 పైగా ఉన్న రా రైస్, బాయిల్ రైస్ మిల్లుల్లో చాలావరకు కార్యకలాపాలను నిలిపివేశాయి.

ప్రభుత్వం రెగ్యులర్ గా నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో దాడుల్లో నిలిపివేయాలని, తమ పట్ల కర్కశంగా వ్యవహరించవద్దని, అందరినీ ఒకే ఘాటిన కట్టి ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ ఇటీవల రైస్ మిల్లుల బందుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో చాలా చోట్ల రైస్ మిల్లుల్లో బియ్యం మరాడించే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయి. కొన్ని మిల్లులకు ఏకంగా తాళాలు కూడా వేశారు. ఫలితంగా చాలా మిల్లులు మూగనోము పట్టాయి.

కార్మికుల ఉపాధికి గండి

దీనితో చాలాచోట్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. కార్మికుల కొరత కారణంగా పెద్దపెద్ద మిల్లుల్లో బీహార్ నుంచి కార్మికులను రప్పించారు. మిల్లుల బంద్ కారణంగా లోకల్ కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికుల ఉపాధికి గండి పడింది. దీనితో అనేక చోట్ల పారిశ్రామిక వాడలు నిర్మానుష్యంగా మారాయి.

మిల్లర్లకు అందని సపోర్ట్?

ప్రభుత్వ తీరుపై పోరాడుతున్న రైస్ మిల్లర్లకు అటు ప్రభుత్వం నుండి, ఇటు రైతుల నుండి, ఇంకోవైపు అధికారుల నుండి, చివరకు కార్మికుల నుండి కూడా ఆశించినంత సపోర్టు లభించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైస్ మిల్లర్లు రైతులపై ఆధారపడి మిల్లులను నిర్వహిస్తున్నప్పటికీ, గతంలో కొందరు రైసుమిల్లర్లు రైతుల నుండి దాన్యం కోత పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని, ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు రైతాంగం నుండి సరైన సపోర్టు లభించడం లేదని చెబుతున్నారు.

ఇక కార్మికుల పరిస్థితి కూడా అలాగే ఉందని, స్థానిక కార్మికులకు సరైన గిట్టుబాటు కూలి చెల్లించకుండా, తక్కువ ఛార్జీతో పనిచేసే ఇతర ప్రాంతాల నుండి కార్మికులను దిగుమతి చేసుకోవడం వల్ల లోకల్ కార్మికుల నుండి కూడా మిల్లర్లకు సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఇక అధికారులు, ప్రభుత్వ వైఖరి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు చెబుతున్నారు.

కొందరు మిల్లర్లు వ్యవహరించిన ఏకపక్ష విధానాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రెగ్యులర్గా నడిపే వారికి కూడా ఇప్పుడు వీరి వల్ల అపఖ్యాతి మూటకట్టుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. మొత్తంగా రైస్ మిల్లర్లకు ఈ కష్టకాలంలో అన్ని వర్గాల నుండి ఆశించిన సానుభూతి, సహాయ సహకారాలు అందడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

రెండు గ్రూపులుగా విడిపోయిన రాష్ట్ర మిల్లర్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైసు మిల్లర్లు రెండు గ్రూపులుగా విడిపోయారని, ఇందులో ఒక వర్గం ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇంకో వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రచారం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల వీరి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీనివల్ల రైస్ మిల్లర్ల ఆందోళన మరికొంత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు