మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం

15-10-2026 | 10:11pm

సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ 

కాగజ్నగర్ ,అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): మున్సిపల్ కార్మికుల సమస్యలు(Municipal Workers Protest ) పరిష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగుతుందని సిఐటియూ జిల్లా కార్యదర్శి రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు 2 వ రోజుకు చేరుకున్నాయి.

కార్మికులకు చెల్లించాల్సిన పి.ఎఫ్ నిధులు రు. 1.40 కోట్లు వెంటనే కార్మికుల అకౌంట్ల లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించిన వేతనాన్ని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనీ పక్షంలో కార్మికుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల  సాధన కోసం  ఆందోళన  చేస్తున్న మున్సిపల్ కార్మికులకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు  మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి అనిత మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో  వెంటనే వారికి రావాల్సిన జీతాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వనమల రాము, వలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు