విద్యుత్ సరఫరా లో అంతరాయంతో రైతుల అవస్థలు
మాజీ ఎమ్మెల్యే కోనప్ప
కాగజ్నగర్, అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం లో రైతులకు ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులకు చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Konappa) ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల అవస్థలు అధికమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు నియోజకవర్గంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరగడంలేదని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతులకు పూర్తిస్థాయిలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి ,రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ ఆచరణలో ఏమాత్రం జరగడంలేదని అన్నారు. కనీసం 9 గంటల విద్యుత్ కూడా రైతులకు సరఫరా కావడం లేదని తెలిపారు.
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసి రైతులను ఆదుకుందని వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు బైరిశెట్టి రవికుమార్, నియాజ్ అలీ , వసీయుద్దీన్, సర్పంచ్ కే. రాజన్న, రైతులు పాల్గొన్నారు.