బస్టాండ్ నిర్మాణం చేపడితేనే రికార్డులు ఇస్తారా..!
సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆందోళన
సమన్వయంతో పనులు చేయండి సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రత్యేక అధికారి నదీమ్
బెజ్జూర్ సెప్టెంబరు 29 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ని రైతు వేదిక కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి నదీమ్(Special Officer Nadeem), ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని గ్రంధాలయ చైర్మన్ అనిల్ అన్నారు.
ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు మాట్లాడారు. మండల విద్యాధికారి డాక్టర్ సునీత మండలంలో పాఠశాలల పనితీరుపై మాట్లాడారు. సర్పంచ్ చిరంజీవి మాట్లాడుతూ అధికారుల పార్టీలో ఉండి కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని, పాఠశాల లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని సభాముఖంగా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రత్యేక అధికారి నదీమ్ సమాధానం ఇచ్చారు.
సూపర్వైజర్ అలేఖ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందిస్తున్నామని తెలపడంతో పూర్తిస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందడం లేదని సర్పంచ్లు శ్రీహరి చిరంజీవి అందించే పౌష్టికాహారం వివరాలను అందించాలని సూచించారు. సిద్దాపూర్ లో అంగన్వాడి టీచర్ లేక చిన్నారులకు విద్య బోధన అందడం లేదని తెలిపారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సమాధానం ఇచ్చారు. గ్రామపంచాయతీ పాపన్నపేట్ నూతన భవన నిర్మాణం కోసం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
బెజ్జూరు గ్రామపంచాయతీ అభివృద్ధి చేయాలంటే రికార్డులు సబ్ కలెక్టర్ తీసుకువెళ్లారని బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపడితేనే రికార్డులు అందిస్తామని తెలుపుతున్నట్లు సర్పంచ్ దుర్గం సరోజ అధికారులకు తెలిపారు. తహసిల్దార్ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే బస్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని సర్పంచ్ తెలిపారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ప్రత్యేక అధికారి నదీమ్ సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, తాసిల్దార్ రామ్మోహన్రావు, వ్యవసాయ అధికారి నాగరాజు, ఏపీవో రాజన్న, ఏఈ అంజల్ కుమార్, ఎస్సై విజయ్ ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.