మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలకు ప్యారడైజ్ టీమ్ పూజలు...
- మేడారం సన్నిధిలో 40 నిమిషాల పాటు హీరో నాని
- తల్లులకు తులాభారం
ములుగు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం(director Srikanth Odela) వహించిన ది ప్యారడైజ్ టీమ్ మంగళవారం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల ఆదివాసి ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలను ఆదివాసి ఆచార సంస్కృతి సాంప్రదాయాలతో దర్శించుకుని అమ్మవార్లకు పసుపు కుంకుమ బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదట ఆదివాసి మేడారం పూజారులు ది పారడైజ్ బృందానికి పూజారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి అమ్మవార్ల గద్దెలపై ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతల తీర్థ ప్రసాదాలను అందించారు. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత చెరుకూరి సుధాకర్, నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వనదేవతల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సినిమా మరింత పెద్ద హిట్ కావాలని, జీవితంలో మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం కల్పించాలని సమ్మక్క సారలమ్మలను వేడుకుని మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొదట ములుగు జిల్లాలోని మొదటి మొక్కులను ఘట్టమ్మ తల్లికి సమర్పించారు. ములుగు జిల్లా కేంద్రం నుంచి అభిమానులు మేడారానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
స్థానిక పోలీస్ అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. పారడైజ్ బృందం మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణంలో మొక్కలు చెల్లించుకున్న అనంతరం సుమారు 45 నిమిషాల పాటు సందడి చేశారు. చిత్ర బృందాన్ని చూసేందుకు, వారితో సెల్ఫీలు దిగేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అభిమానులు పోటీపడ్డారు.