పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు...
మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణ
వెంకటాపురం, నూగూరు సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):వెంకటాపురం మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణ(Panchayat Officer Bogga Narayana) అన్నారు. వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 18 గ్రామపంచాయతీలకు చెందిన మల్టీపర్పస్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని, ప్రజలకు తడి చెత్త–పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే గ్రామాల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని మల్టీపర్పస్ వర్కర్లకు సూచించారు. ప్రతి మల్టీపర్పస్ వర్కర్‌కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్దనే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు.