ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ, ఇతర పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేసిందని, నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధం చేయడం జరుగుతుందని, ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులు, వంటశాల, తరగతి గదులు పరిసరాలను పరిశీలించారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల పనులను పరిశీలించారు
విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన విద్య బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్ మల్లికార్జున్ తో కలిసి గోదావరి పుష్కరాలు 2027 లో భాగంగా గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాటు, రహదారుల మరమ్మత్తు, వాహనాల నిలుపుదల, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడుతూ గోదావరి పుష్కర పనుల నిర్వహణలో రైతులు సహకరించాలని తెలిపారు.