మయూఖ పూర్తి థ్రిల్లర్‌గా ఆకట్టుకునే చిత్రం
పాయల్ చెంగప్ప(Payal Chengappa) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మయూఖ(Mayukha)’. ఈ చిత్రానికి శ్రీతేజ్ ఎస్‌కే(Sritej SK) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల(Sasidhar Nalla) నిర్మిస్తున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు ఆసక్తికర సినిమాలు నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల.. ఇప్పుడు శ్రీతేజ్ ఎస్‌కేగా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 9న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్న ఈ సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు డైరెక్టర్ శ్రీతేజ్ ఎస్‌కే. “మా మయూఖ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చింది.
థ్రిల్లర్ కేటగిరిలో మా సినిమా సెకండ్ బెస్ట్‌గా నిలిచింది. ఇది మేము ఊహించలేదు. విషయం తెలిసి టీమ్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. మా సినిమాలో స్క్రీన్‌ప్లే, సినిమా కథను నడిపే విధానం కొత్తగా ఉంటుంది. ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కాబట్టే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ థ్రిల్లర్‌గా అవార్డ్ దక్కింది. ఇక్కడే మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే నమ్మకం మొదలైంది. అందుకే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కూ మా మూవీని అప్లై చేశాం. మా సినిమాలో కొరియన్, హాలీవుడ్ మూవీ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంటుంది.
ఇటీవల మన ప్రేక్షకులు ఓటీటీల్లో థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు బాగా చూస్తున్నారు. వాళ్లకు నచ్చేలా ఉండాలంటే కొత్తగా, క్వాలిటీగా మా ‘మయూఖ’ను రూపొందించాం. ‘మయూఖ’ హారర్ కాదు థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్‌తో అతనికి రిలేషన్ ఏంటి.. ఇలాంటి అంశాలతో కథ సాగుతుంటుంది.
‘మయూఖ’ అంటే ఆశాకిరణం. సినిమా చివరకు వచ్చేసరికి ఈ సినిమాకు ఈ టైటిల్ న్యాయమైనదేనన్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులు ఇవ్వబోతున్నాం. మున్ముందు నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నా. అది క్లీన్ యు సర్టిఫికెట్ సినిమా అవుతుంది” అని తెలిపారు.