అక్రమ బాణాసంచా గుర్తిస్తే కఠిన చర్యలు

07-11-2026 | 05:37pm

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట తహశీల్దార్, (ట్రైనీ) డిప్యూటీ కలెక్టర్, మద్దినేని మురళి దమ్మపేట మండల ప్రజలకు, వ్యాపారులకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.

మండల పరిధిలోని బాణాసంచా వ్యాపారులకు తెలియజేస్తూ సంబంధిత అధికారుల అనుమతి, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా బాణాసంచా నిల్వ చేయడం, విక్రయించడం, ఇళ్లలో అక్రమంగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమనీ, మండల పరిధిలో ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వ చేసినా, విక్రయించినా, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

బాణాసంచా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చిన్న ప్రమాదం సైతం పెను విపత్తుగా మారే అవకాశం ఉందని, మండల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండి, ఎక్కడైనా అక్రమ బాణాసంచా నిల్వలు, అనుమతులు లేని విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

మరిన్ని వార్తలు