బూజు పట్టిన సమోసా..పర్యాటకుల ఆగ్రహం

09-11-2026 | 08:41pm

సిద్దిపేట కోమటి చెరువు వద్ద కలుషిత ఆహార విక్రయం

సిద్దిపేట, నవంబర్ 9 (విజయక్రాంతి) : సిద్దిపేట(Siddipet) లోని పర్యాటక ప్రాంతమైన కోమటి చెరువు(Komati Cheruvu) వద్ద విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై(Quality of food products) తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అక్కడ సందర్శనకు వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. దుకాణదారులు బూజు పట్టిన, పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.కోమటి చెరువు వద్ద ఉన్న ఓ దుకాణంలో పర్యాటకులు సమోసా(samosas) కొనుగోలు చేశారు. అయితే చిన్నారులు తినే ఆ సమోసా నుంచి  దుర్వాసన రావడంతో పాటు, పరిశీలిస్తే దానిపై బూజు పట్టి ఉండటాన్ని వారు గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన బాధితులు వెంటనే షాక్ అయి,దుకాణదారుడిని నిలదీశారు.డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తే ఇలా బూజు పట్టిన,పాడైపోయిన ఆహారం పెడతారా? పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా?అంటూ పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము బయటి ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటామని, ఒకవేళ పిల్లలు ఈ ఫుడ్ తిని అనారోగ్యపాలై, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే బాధ్యత ఎవరిదని వారు దుకాణదారుడిని ప్రశ్నించారు.

దుకాణదారుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు