మూడు రోజుల పాటు కార్తీకోత్సవాలు

09-11-2026 | 08:46pm

ఈ నెల 20 నుంచి 22 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు..

పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు, నవంబర్ 9 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీకోత్సవం–2026 పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ భవానీ శంకర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి పాల్గొన్నారు. కార్తీకమాసం పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళారూపాలను పరిరక్షించి ప్రోత్సహించే లక్ష్యంతో దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, భక్తి సంగీత కచేరీలు, తెలంగాణ సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మూడు రోజుల కార్యక్రమాల వివరాలు

నవంబర్ 20, శుక్రవారం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవస్థాన అర్చక బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ నామార్చన సహిత కోటి పుష్పార్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు శ్రీమతి తేలు విజయ జానపద భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

నవంబర్ 21, శనివారం: సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పరంపర సంస్థ దర్శకత్వంలో ఆర్.పి. పట్నాయక్, నిహాల్, నిత్యసంతోషిని, గోపిక పూర్ణిమ, శ్రీనిధి, స్వప్న తదితర కళాకారులు, వాద్య బృందం సహకారంతో నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

నవంబర్ 22, ఆదివారం: సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు రుద్రాక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒడిస్సీ నృత్య ప్రదర్శన, అనంతరం అభినేత్రి బృందం ఆధ్వర్యంలో తెలంగాణ దేవాలయాల ఇతివృత్తంతో నృత్య ప్రదర్శన, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కళాకృష్ణ బృందం పేరిణి నృత్యం, ఒడిస్సీ తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ శాస్త్రీయ కళలు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని భక్తులకు పరిచయం చేయనున్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు