అమిత్ షాకు దమ్ముంటే ఒవైసీపై పోటీ చేయాలి

21-11-2026 | 05:10am
  1. బీజేపీవి జాతి, మత రాజకీయాలు
  2. రాష్ట్రంలో మాకు బీఆర్‌ఎస్సే ప్రత్యర్థి 
  3. నా కథలో కేసీఆర్ రావణాసురుడు.. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నేత
  4. ఓ టీవీ ఛానల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా దమ్ముంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరారు. కేవలం హిందూ, ముస్లిం ఓట్ల కోసమే మోదీ, అమిత్ షా.. అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని, వారి మధ్య పెద్దగా ఏమీ పోటీ లేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్‌ఎస్సేనని, రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదని వ్యాఖ్యానించారు. తన రామాయణ కథలో కేసీఆర్ రావణాసురుడైతే.. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నేత అని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ న్యూస్ ఛానల్  నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’లో సీఎం  రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

డీలిమిటేషన్‌తో బీజేపీ కుట్ర

దక్షిణాదికి నష్టం చేకూర్చేలా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, అలా చేస్తే కేవలం ఉత్తరాది సీట్ల బలంతోనే అధికారం దక్కించుకునే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని ఒప్పుకోబోమని చెప్పారు. రాష్ట్రాలు, జనాభా, జీడీపీ ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే వెంటనే అమలు చేయొచ్చని.. అందుకోసం కొత్తగా చట్టాలు, సవరణలు అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 స్థానాలను మహిళలకు కేటాయించొచ్చని సీఎం సూచించారు.  

విజిటింగ్ ప్రధానిలా మోదీ  

ప్రధాని నరేంద్ర మోదీ ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్’లా మారారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన విదేశీ పర్యటనలకు లెక్క లేకుండా పోయింది. ప్రధాని తన జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేదు. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే చెప్తూ అధికారం కోసమే పాకులాడుతున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

పేదల ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.  మోదీకి ముందున్న ప్రధానులందరూ చేసిన అప్పు దాదాపు రూ. 53 లక్షల కోట్లు మాత్రమేనని... 12 ఏండ్ల పాలనలో మోదీ రూ. 120 లక్షల కోట్ల అప్పులు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంత అప్పు చేసినా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తాను ఏబీవీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావించి కాంగ్రెస్‌లో చేరానని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఎలాంటి ఉనికి లేదని, ఆ పార్టీ చాలా స్థానాల్లో పోటీ ఇచ్చే స్థాయి కూడా లేదని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షం ఉండాలనే.. బీఆర్‌ఎస్‌ను కొనసాగిస్తున్నం

బీఆర్‌ఎస్ నాయకులంతా పగటి కలల్లో జీవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తానని, కేటీఆర్‌ను అసలు సీరియస్‌గా తీసుకోనని ఆయన అన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని మేనేజ్‌మెంట్ కోటాలో కేటీఆర్ నాయకుడయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  

మరిన్ని వార్తలు