1 నుంచి పాదయాత్ర పునః ప్రారంభం
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వెల్లడి
వరంగల్లో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న(TRP President Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్రను డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయించింది. శుక్రవారం వరంగల్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్ ప్రకటించారు.
సమావేశం ప్రారంభంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చందనకు పార్టీ నాయకులు మౌనం పాటించి నివాళులర్పించారు. బీసీ రాజ్యాధికార సాధన లక్ష్యంతో చేపట్టిన పాదయాత్ర ఇప్పటివరకు కొనసాగిన 51 రోజుల ప్రస్థానంపై సమావేశంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పాదయాత్రకు ప్రజల నుంచి లభించిన ఆదరణ, గ్రామస్థాయిలో బీసీ రాజ్యాధికారంపై పెరుగుతున్న చర్చ పార్టీకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని నాయకులు పేర్కొన్నారు.
వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. టీఆర్పీ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ సమక్షంలో ఎన్నికల సన్నద్ధత, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ, మూడు జిల్లాల్లో పార్టీ శ్రేణుల సమన్వయం, భవిష్యత్తు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. ఒకవైపు బీసీ రాజ్యాధికార పాదయాత్రను కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని అన్నారు. అనంతరం పార్టీలో నూతనంగా చేరిన వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు మదన్ మోహన్ చారి, జ్యోతి పండేల్, ఉపాధ్యక్షులు మంజుల, రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, పిట్టల శంకర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పూజారి సత్యనారాయణ, వరంగల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల సంపత్, జాతీయ వ్యవహారాల ఇన్చార్జి పూజిత, జనగామ జిల్లా ఇన్చార్జి బిక్షపతి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని దేవన్నపేట గ్రామంలో టీఆర్పీ జెండాను పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జ్ జాదవ్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు.