యాదగిరిగుట్టలో మెరుగైన సౌకర్యాలు

21-11-2026 | 05:25am

మరింత వేగంగా ఆలయ అభివృద్ధికి సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం

ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలు 

హైదరాబాద్, నవంబర్ 20 (విజయాక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షించడం లక్ష్యంగా ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం ఆలయ ఈవో భవానీ శంకర్(Temple EO Bhavani Shankar) ఆధ్వర్యంలో చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి(Chairman Manne Satyanarayana Reddy) సమక్షంలో ధర్మకర్తల మండలి 4వ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో విజేందర్ గౌడ్, సభ్యులు సీ విజయరాజం, ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, కే లక్ష్మీనారాయణ, ఎక్స్-అఫీషియో సభ్యుడు కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. ఆదాయ వ్యయాల సమీక్ష జరిపారు. నిత్యాన్నప్రసాదానికి అరటి ఆకుల సరఫరాకు టెండర్‌లో అత్యల్ప ధరగా కోట్ చేసిన ధరను మండలి ఆమోదించింది. లీజులు టెండర్ల విధానంపై సమీక్ష జరిపారు.

దీనిపై వాస్తవ వివరాలతో నివేదిక సమర్పించేందుకు ఇద్దరు ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫోటోగ్రఫీ, వీడియో పరికరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ద్వారా సమకూర్చుకునే ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది.  సివిల్ ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణపై సమీక్ష జరిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను విస్తరించేందుకు నిర్ణయించింది. పరిపాలనా సామర్థ్యం పెంపునకు శాఖల రొటేషన్ బదిలీ చేయాలని మండలి తీర్మానించింది. 

మరిన్ని వార్తలు