ధాన్యం ధర తగ్గించారు.. రైతుల నిరసన
కేసముద్రం, నవంబర్ 10 (విజయక్రాంతి): తేమ సాకుతో ధాన్యానికి తక్కువ ధర పెట్టారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు(Kesamudram Agricultural Market Yard) ఎదుట రోడ్డుపై పలువురు రైతులు రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం బంజర గ్రామానికి చెందిన కొందరు రైతులు ధాన్యాన్ని విక్రయానికి మార్కెట్ కు తెచ్చారు. అయితే ఐదుగురు రైతులకు క్వింటాలకు గరిష్టంగా 2,500 ధర పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు.
సన్నధాన్యానికి ఓవైపు మద్దతుకు మించి ధర లభిస్తోందని చెబుతూ మరోవైపు తక్కువ ధర పెట్టడం సమంజసం కాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకొని తేమ శాతం 25 నుండి 27 ఉండడం వల్ల ధర తగ్గిందని, తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించాల్సిన అవసరం లేదని, బాగా ఆరబెట్టి తేమ తగ్గిన తర్వాత విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.