‘మీ సేవ’లో మోసాలు!
- అనుమతి ఒక చోట, నిర్వహణ మరో చోట
- ఆన్లైన్ కేంద్రాలకు నిర్వాహకుల లాగిన్!
- అక్రమంగా కేంద్రాలు, అడ్డదిడ్డంగా వసూళ్లు
- అధిక రుసుములతో ప్రజల జేబులకు చిల్లులు
- తనిఖీలు శూన్యం.. పర్యవేక్షణ పరిహాసం
మహబూబాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వం జారీ చేసే వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు, అనేక రకాల ప్రభుత్వ ధృవపత్రాల జారీలో కీలకంగా మారిన ‘మీ సేవ’ కేంద్రాల(‘mee seva’ Centers) నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాల్సిన మీసేవ కేంద్రాల్లోనే నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అనుమతి పొందిన కేంద్రాల్లో కాకుండా ఇతర ఆన్లైన్ కేంద్రాల్లోనూ మీ సేవ కార్యకలాపా లు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు విని పిస్తుండగా.. సేవ ల పేరుతో ఇష్టారాజ్యంగా రుసుములు వసూ లు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఆన్లైన్ కేంద్రాల్లో మీ సేవలు.?
నిబంధనల ప్రకారం ఏర్పాటుచేసిన మీసేవ కేంద్రంలోని ప్రభుత్వ అధికృత సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే దొడ్డి దారిలో ఆపరేటర్ల పేరుతో ఆన్లైన్ కేంద్రాల్లో మీ సేవలు అందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యధికంగా సేవలందించే మీ సేవ కేంద్రాల మొదటి నిర్వహకుడు అదనంగా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన వెసులుబాటు అక్రమాలకు ఉతంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీసేవ నిర్వాహకుని లాగిన్ ద్వారా ఆపరేటర్ల పేరుతో ఇతర చోట్ల ఆన్లైన్ కేంద్రాలు నిర్వహిస్తూ, ప్రజల నుండి అడ్డదిడ్డంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అనుమతి ఒకచోట.. కార్యకలాపాలు మరోచోట!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవ కేంద్రాల నిర్వహణ, సేవల అందజేత నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా సాగాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల అనుమతి పొందిన కేంద్రాల పరిధిని దాటి ఇతర ఆన్లైన్ కేంద్రాల్లోనూ మొదటగా నియమింపబడ్డ మీసేవ నిర్వాహకుడి లాగిన్ ద్వారా ఆపరేటర్లు ఆన్లైన్ కేంద్రాల్లో మీ సేవ సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మీ సేవ మొదటి నిర్వాహకుడు ఎక్కువ ట్రాన్సాక్షన్ల పేరుతో ఆపరేటర్లను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వగా, అదనపు ఆపరేటర్ల పేరుతో ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
అనుమతి మంజూరు చేసిన మీసేవ లొకేషన్ యాక్సెస్ ద్వారా ఇతర చోట్ల నిర్వహిస్తున్న కేంద్రాలను గుర్తించి రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అనుమతి పొందిన రెవెన్యూ గ్రామాల పరిధి దాటి ఇతర చోట్ల ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలను తిరిగి యధా స్థానాలకు తరలించాల్సిన అవసరం ఉంది.
రుసుముల వసూళ్లలో ఇష్టారాజ్యమా?
ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించాలనే లక్ష్యంతో మీ సేవ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని కేంద్రాల్లో నిర్ణీత రుసుములకు మించి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన పథకాల అమలులో మీసేవ కేంద్రం నిర్వాహకులు కొందరు నిర్ణయించిన చార్జీ వసూలు చేయకుండా, ఇష్టానుసారంగా ప్రజలను దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఏ సేవకు ఎంత రుసుము చెల్లించాలి?రుసుము ఎంత? ఆన్లైన్ సేవా చార్జీ ఎంత? అనే వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలియజేయకపోతే వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉంది. రుసుముల పట్టికలను ప్రదర్శించడం, రసీదులు తప్పనిసరిగా అందించడం ద్వారా పారదర్శకతను పెంచాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంది.
నిరంతర తనిఖీలతోనే అడ్డుకట్ట
మీ సేవ కేంద్రాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అనుమతుల వివరాలు, కేంద్రాల చిరునామాలు, సేవల నిర్వహణ తీరు, వసూలు చేస్తున్న రుసుములను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కానీ క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజలకు భరోసా కల్పించాలి
మీ సేవ కేంద్రాల్లో అక్రమ నిర్వహణ, అధిక వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి. అనుమతులు పొందిన కేంద్రాల వివరాలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో రుసుముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేయాలి.
కమీషన్లు వాళ్లకు.. అదనపు వసూళ్లు వీళ్లకు!
కొందరు మీసేవ నిర్వాహకులు త మ లాగిన్ ద్వారా ఆపరేటర్లను ఏర్పా టు చేసుకొని కల్యాణ లక్ష్మి, ఇతర సం క్షేమ పథకాలతో పాటు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరహా మోసాలు మహబూబాబాద్ జిల్లా బయ్యారం, మరిపెడ మండలాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి.
ఉదాహరణకు మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70 ఆన్లైన్ కేంద్రాలు ఉండగా, 8 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇందులో కేవలం రెండు మా త్రమే మరిపెడ కేంద్రానికి మంజూరు చేసినవి కాగా మిగిలిన 6 మరిపెడ పరిసర ప్రాంతాలకు కేటాయించినవి మరి పెడలోనే నిర్వహిస్తున్నారు.
మరో 10 ఆన్లైన్ కేంద్రాల్లో దొడ్డి దారిలో ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో అనుమతి పొందిన మీసేవ నిర్వాహకుల లాగిన్ ద్వారా మీ సేవలు అందిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అసలు మీసేవ నిర్వాహకులకు ట్రాన్సాక్షన్ లపై వచ్చే కమిషన్లు చెందుతుండగా, ఇతర దందాల ద్వారా ఆపరేటర్లకు అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.