ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి
- యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం
- మహబూబ్‌నగర్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్
- జడ్చర్లలో దసరా వేడుకలకు హాజరు
మహబూబ్‌నగర్/కల్వకుర్తి, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రజాపాలన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) స్పష్టం చేశారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన దసరా వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని యువతకు, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మహబూబ్‌నగర్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన జిల్లాగా ఎదగాలని ఆకాంక్షించారు.
జడ్చర్ల పట్టణం, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకు సాగాలన్నారు. అనంతరం నిర్వహించిన రావణ దహన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి,
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా ఎస్పీ జానకి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, తహసీల్దార్ నర్సింగరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం సొంతూరులో దసరా వేడుకలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి, కోట మైసమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేసి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండారెడ్డిపల్లికి చేరుకోగా నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయం తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఓపెన్‌టాప్ జీపులో గ్రామంలోకి బయలుదేరగా, గ్రామస్థులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.