ఫోర్ సీజన్స్ రెస్టారెంట్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు
జడ్చర్ల: పట్టణంలోని కర్నూల్ రోడ్డు, జాతీయ రహదారి 44 సమీపంలో ఉన్న ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ అండ్ మండిలో మున్సిపల్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర వంటగది, మురుగునీటి సమస్యలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి తొలగించారు.
రెస్టారెంట్ యాజమాన్యం 48 గంటల్లో లోపాలను సరిచేసి నివేదిక అందించాలని నోటీసులు జారీ చేశారు. రూ.10 వేల జరిమానాకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ గిరీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ శివశంకర్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.