పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి

23-11-2026 | 11:18pm

ఆర్టీఐ ద్వారా అసంపూర్తి సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి 

మిడ్జిల్, నవంబర్ 23: మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా మిడ్జిల్ మండలం అయ్యావారిపల్లి గ్రామపంచాయతీలో 2019–2023 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామస్థులు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కోరారు. ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం గ్రామపంచాయతీ నిధులు, అభివృద్ధి పనుల వివరాలు కోరగా ఎంపీడీవో కార్యాలయం అసంపూర్తి సమాచారం ఇచ్చిందని ఆరోపించారు.

గత పాలకవర్గం హయాంలో సుమారు 100 ట్రాక్టర్ ట్రిప్పుల గ్రానైట్ రాళ్లతో పాటు నర్సరీ ప్లాంటేషన్‌కు సంబంధించిన సామగ్రి, పాఠశాల, పంచాయతీకి చెందిన ఇనుప కంచెలు, గేట్లు విక్రయించినట్లు పేర్కొన్నారు. జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలోని చెట్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా నరికి విక్రయించారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు, పంచాయతీ సొంత నిధులు, పండుగలకు వచ్చిన విరాళాల లెక్కలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని, విచారణ కోరుతున్న వారిని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిధులను తిరిగి రాబట్టి గ్రామాభివృద్ధికి వినియోగించాలని కోరారు.

మరిన్ని వార్తలు