వెయ్యి మంది నిరుద్యోగులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’
* పోలీసు ఉద్యోగాల సాధనకు పీఎస్ఆర్ ట్రస్ట్ చేయూత
* ఒక్కొక్కరికీ 16 పుస్తకాలతో కూడిన పోటీ పరీక్షల కిట్లు పంపిణీ
* ఉద్యోగాలు సాధించి శీనన్న రుణం తీర్చుకుంటామన్న అభ్యర్థులు
ఖమ్మం, నవంబర్ 23 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ.. పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా వారికి అవసరమైన శిక్షణ, అధ్యయన సామగ్రిని అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పొంగులేటి స్వరాజ్యం – రాఘవ రెడ్డి (పీఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరిట పోటీ పరీక్షల పుస్తకాల కిట్లను పంపిణీ చేశారు.
సోమవారం సాయంత్రం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి పంపిణీ చేశారు. రైట్ ఛాయిస్ అకాడమీ ఛైర్మన్ మెండెం కిరణ్‌కుమార్, ఏదులాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ పోకబత్తిని అనిత అభ్యర్థులకు ఈ కిట్లను అందజేశారు. ఒక్కో కిట్‌లో 16 రకాల పుస్తకాలను పొందుపరిచారు.
ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ..: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం కల్పించాలన్న సంకల్పంతో మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అందుకోసం ఖర్చుకు వెరవకుండా ఉచిత కోచింగ్‌తో పాటు అవసరమైన పుస్తకాలను సైతం అందిస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు కష్టపడి చదివి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని.. తల్లిదండ్రుల ఆశలను, శీనన్న ఆకాంక్షలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగమే లక్ష్యం.. శీనన్నకు కృతజ్ఞత
తమకు ఉచిత శిక్షణ అందించడంతో పాటు విలువైన పుస్తకాల కిట్లను కూడా అందిస్తున్న మంత్రి పొంగులేటికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. శీనన్న తమకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి పోలీసు ఉద్యోగాలు సాధిస్తామని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టి రుణం తీర్చుకుంటామని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు.
కిట్‌లోని 16 పుస్తకాలివే..
తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ అంశాలు, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వర్క్‌బుక్, ఫిజికల్ సైన్సెస్, రీజనింగ్, అర్థమెటిక్ వర్క్‌బుక్, ఇండియన్ జాగ్రఫీ, అర్థమెటిక్, తెలంగాణ సంస్కృతి–ఉద్యమ చరిత్ర పుస్తకాలను కిట్‌లో అందించారు. ఈ కార్యక్రమంలో..: పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.