జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కేవరకూ వారితో కలిసి పోరాడుతా

23-11-2026 | 10:51pm
  1. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి...
  2. 420 హామీలతో గద్దెనెక్కి మోసం చేస్తే ఊరుకునేదిలేదు
  3. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) సంతకాల సేకరణ ఉద్యమంలో బీఆర్ ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్
  4. ఖమ్మం అమరవీరుల స్తూపం వద్ద టీజేఎఫ్ నిరసనకు అనూహ్య స్పందన
  5. వందలాదిగా తరలివచ్చిన ఖమ్మం నగర ప్రముఖులు

ఖమ్మం, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకూ ఇంటి స్థలం దక్కేవరకూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఖమ్మంలో  గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం కేటాయించిన 23.2 ఎకరాల భూమిని వెంటనే జర్నలిస్టులకు పంపిణీ చేయాలని, లేకపోతే తాము జర్నలిస్టుల ఉద్యమంలో కలిసి పోరాడుతామని బీఆర్ఎస్ఎంపీ, రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా వెయ్యి మంది ఉన్న జర్నలిస్టులకు న్యాయబద్దంగా దక్కాల్సిన ఇండ్ల స్థలాలను పంపిణీ చేయడంలో తాత్సారం చేయడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ గత ప్రభుత్వం కేటాయించిన భూమిని పంపిణీ చేయాలంటూ టీయూ డబ్ల్యూజే(టీజేఎఫ్) సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి స్వయంగా వచ్చి మద్దతు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ...‌ అమరవీరుల స్తూపం సాక్షింగా ఆందోళన చేస్తున్న టీయయూ డబ్ల్యూజే(టీజేఎఫ్) ఉద్యమం పూర్తిగా చట్టబద్దమైంది, న్యాయమైందన్నారు.

ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు అవుతున్నా జర్నలిస్టులకు ఇస్తానన్న భూమిని ఇవ్వకుండా మోసం చేయడం ఎంతవరకు న్యాయమో ముగ్గురు మంత్రులు గుర్తించాలన్నారు. 2023 జనవరి 19న ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన జీఓ తీసుకురావడంలో నాడు మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి జీఓ రద్దుకాకుండా చేశామని ఎంపీ గుర్తుచేశారు. ఆ జీఓ ఫలితంగానే స్థల సేకరణ పూర్తయిందన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి...

420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ చివరికి జర్నలిస్టులకు ఇస్తానన్న ఇండ్ల స్థలం పంపిణీ చేయడంలో జర్నలిస్టులను కూడా మోసం చేసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1800మంది జర్నలిస్టులు ఉన్నారనీ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44వేల మంది జర్నలిస్టులున్నారనీ వారందరికీ ఒకొక్కరికి 150 గజాల స్థలం ఇచ్చినా మొత్తం కలిపి 1375 ఎకరాలు కేటాయించి పంపిణీ చేస్తే సరిపోతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో  మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వర రావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీ ఎన్ జీ ఓ స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, బుల్లెట్ శ్రీను, హాస్టల్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, మహిళా నాయకురాలు కోమలి,  హై కోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గౌడ్, తెలంగాణ పబ్లికేషన్ అధినేత  కోయ చంద్రమోహన్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా గోంగూర వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యూరో వైద్యులు డా. జీ వీ మురళి, సాయిరాం గ్యాస్ట్రో హాస్పిటల్ అధినేత డా జంగాల సునీల్ కుమార్, సీసీఏ ప్రతినిధులు స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజయ్, డా.బీఆర్ అంబేద్కర్ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల రవికుమార్, పీడీఎస్‌యూ నేతలు మస్తాన్, లక్ష్మణ్, పీవైఎల్ నేతలు భరత్, కార్మిక సంఘాల నేతలు మోహన్‌రావు, బీఆర్ ఎస్ నేత గౌస్ పాషా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మేరుగు వెంకటరమణ, మాలమహానాడు రాష్ట్రనాయకులు గుంతేటి వీరభద్రం, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ భద్రూనాయక్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు నరేందర్, జంపాల ఈశ్వర్, టీయూసిఐ నేత రామయ్య, గాయకుడు రాము, జర్నలిస్టు యూనియన్ జిల్లా నాయకుడు కల్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు

మరిన్ని వార్తలు